News

టిఆర్‌ఎస్ హయాంలోనే మైనార్టీ సంక్షేమం


మైనార్టీల సమస్యలను గుర్తించి వాటి పరిష్కరరించడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుందని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా సిద్దిపేట పట్టణంలో ఎక్బాల మినార్ వద్ద రంజాన్ వేడుకలలో ముస్లీం సోదరులతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌తో పాటు పట్టణ టిఆర్‌ఎస్ అధ్యక్షులు నయ్యర్ పటేల్‌తో పాటు ముస్లిం సోదరులకు ఆయన అలాయ్ బలాయ్‌తో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీలు అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురయ్యారని ఆయన తెలిపారు. మైనార్టీ ఆడపిల్లల వివాహాల కోసం ప్రభుత్వం షాదీ ముబారక్ పథకం అమలు చేయడం జరిగిందన్నారు. అలాగే రంజాన్ పండుగను రాష్ట్ర పండుగగా అధికారికంగా గుర్తించడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా 200 చోట్ల ఇప్తార్ విందులు ఏర్పాటు చేసిన ఘనత కేవలం టిఆర్‌ఎస్ ప్రభుత్వంకే దక్కుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీల పిల్లలకు చదువుల కోసం 10 రెసిడెన్సీ హాస్టలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.


గతంలో మైనార్టీలను పట్టించుకునే వారు లేరని, నేడు వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సమాజం అంతా బాగుండాలని అల్లాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అలాగే మజీదుల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రంజాన్ పండుగ అంగరంగ వైభవంగా సాగిందని ఆయన తెలిపారు. పండుగ సందర్భంగా పేద ముస్లింలకు దుస్తులు, వస్తువులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మంత్రి హరీశ్‌రావు వెంట ఆర్డీఓ ముత్యంరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, టిఆర్‌ఎస్ నాయకులు పూజల వెంకటేశ్వర్‌రావు(చిన్నా), మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కొండం సంపత్‌రెడ్డి, బర్ల మల్లిఖార్జున్,కరాటే కృష్ణ, మోహన్‌లాల్, శేషుకుమార్ తదితరులు న్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు రంజాన్ విందులో పాల్గొన్నారు