News

పార్ల‌మెంట్ లో నాదే వాయిస్ : సోనియా


కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం  ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు ప్రతిపక్ష పార్టీల అగ్ర నేతలు హాజరయ్యారు. వీరిలో బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, ఆయన సన్నిహితుడు ప్రఫుల్‌ పటేల్‌ ఉన్నారు. జమ్మూకాశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, డీఎంకేకు చెందిన కనిమొళి, బీఎస్‌పీ నేత సతీశ్‌ మిశ్రా, ఆర్జేడీ నుంచి ప్రేమ్‌ గుప్తా, జైప్రకాశ్‌ యాదవ్‌, టీఎంసీ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నేతలు చిదంబరం, ఆనంద్‌ శర్మ, సల్మాన్‌ ఖుర్షీద్‌ హాజరయ్యారు. ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తాను ఈ విందుకు హాజరు కాలేనని గతంలో ప్రకటించారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. సోనియాకు ములాయం లేఖ రాశారని, తాను రాలేకపోతు న్నట్లు తెలిపారని కొందరు చెప్తున్నారు, అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. గైర్హాజరైన ప్రముఖుల్లో ఢిల్లిద్ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఒకరు. ఈ జాబితాలో వామపక్షాల నేతలూ ఉన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ విందుకు ప్రాధాన్యం ఏర్పడింది. గత మేలో అధికారం లోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ సమావేశాల నిర్వహణ సంక్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. మీడియాతో రాహుల్‌ గాంధీ పిచ్చాపాటీ మాట్లాడినపుడు కూడా ఇవే సంకేతాలు వెలువడ్డాయి. రాబోయే సమావేశాల్లో పార్లమెంటులో మాట్లాడేందుకు ప్రతిపక్షానికి అనేక అంశాలు ఉన్నాయన్నారు. మోడీ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేందు కు నాయకత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ''ప్రధాని మాట్లాడినా, మాట్లాడకపోయినా నేను మాట్లాడతాను'' అన్నారు. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయనే సందేశాన్ని పంపించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింథియాలపై లలిత్‌ మోడీకి సాయపడ్డారనే ఆరోపణలు వచ్చాయి. వ్యాపమ్‌ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. బీజేపీకి, మోడీ ప్రభుత్వానికి ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. సుష్మా స్వరాజ్‌, వసుంధర రాజే, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్లను బీజేపీ తిరస్కరిస్తోంది. ప్రతిపక్షాలకు ఇవే ప్రధానాస్త్రాలు. మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలను తప్పుగా పేర్కొన్నారని, ఆమె రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. మహరాష్ట్ర మంత్రి పంకజ ముండే రూ.206 కోట్ల విలువైన వస్తువుల కొనుగోళ్లకు ఒకేరోజులో అనుమతులిచ్చారని, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఆమె రాజీనామా కోరుతోంది. ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌ సింగ్‌ బియ్యం కుంభకోణంలో చిక్కుకున్నారని ఆరోపిస్తోంది