News

అమ్మ ఫొటో మాయమైంది


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై ఆ పార్టీ శ్రేణులు అపారమైన భక్తి,గౌరవాలను ప్రదర్శిస్తుంటాయి. తమిళనాట ఆమెను ‘అమ్మ’గా భావిస్తారు. ఆమె మరణానంతరం పార్టీ అగ్రనేతల నుంచి చిన్న స్థాయి కార్యకర్తల దాకా ఆమె ఫొటోను ఎల్లప్పుడూ తమ వద్ద ఉంచుకుంటూ కన్పించేవారు. ఇక అధికార సమావేశాల్లో సైతం మంత్రులు, ఎమ్మెల్యేల టేబుళ్ల మీద అమ్మ ఫొటో ఉండాల్సిందే. కానీ ఒక్కసారిగా ఏమైందో తెలియదు ఈ వర్షాకాల సమావేశాల్లో అధికార పక్ష సభ్యులు టేబుల్స్‌పై అమ్మ ఫొటో మాయమైంది. వాస్తవానికి గత బడ్జెట్‌ సమావేశాల్లోనూ వారంతా తమ ముందు జయలలిత ఫొటోను పెట్టుకుని మరీ సమావేశాలకు హాజరయ్యారు. మీడియాకు ప్రస్ఫుటంగా కనిపించేలా దీన్ని ప్రదర్శించేవారు. ఇక ఆహ్వాన పత్రికల్లోనూ, డైరీలపైనా అధికార పక్ష నేతలు తప్పనిసరిగా ఆమె ఫొటోను ప్రదర్శిస్తూ తమ భక్తి చాటుకునేవారు. కానీ ఇప్పుడు ఏమైందో తెలియదు. నేతలంతా జయలలిత ఫొటోను తమ టేబుళ్లపై నుంచి తొలగించారు. ప్రస్తుతం ఇది తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. కావాలని పక్కన పెట్టారా లేక పొరపాటుగా జరిగిందా అనే అంశంపై రకరకాల వాదనలు మొదలయ్యాయి.