News

ఫ్లిప్‌కార్ట్‌ మరో భారీ ఆఫర్‌


తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ స్నాప్‌డీల్‌ను కొనుగోలుకు ఫ్లిప్‌కార్ట్‌ మరో భారీ ఆఫర్‌ ప్రకటించింది. స్నాప్‌డీల్‌ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే పలు ప్రతిపాదనలు ముందుంచిన సంగతి తెలిసిందే. తాజాగా 900 మిలియన్‌ డాలర్లు(సుమారు రూ.5,791కోట్లు) నుంచి 950 మిలియన్‌ డాలర్లు(సుమారు రూ.6,113కోట్లు) చెల్లించేందుకు ఫ్లిప్‌కార్ట్‌ సిద్ధంగా ఉందని వ్యాపార వర్గాల సమాచారం. ఇందుకు ఇరు కంపెనీలు చర్చలకు సుముఖంగా ఉన్నాయని, తాజా ప్రతిపాదన మొత్తంపై స్నాప్‌డీల్‌ విలువకట్టే ప్రయత్నం చేస్తోందట. ఈ నెల మొదటి వారంలో స్నాప్‌డీల్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌ 800 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.5,148 కోట్లు) 850 మిలియన్‌ డాలర్లు(రూ.5,469 కోట్లు) చెల్లించేందుకు ప్రతిపాదన తీసుకురాగా, అందుకు స్నాప్‌డీల్‌ విముఖత కనబరిచింది. దీంతో కొత్త ప్రతిపాదనను ఫ్లిప్‌కార్ట్‌ తీసుకొచ్చింది. అయితే, కేవలం స్నాప్‌డీల్‌కు చెందిన యూనికామర్స్‌కు మాత్రమే ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. స్నాప్‌డీల్‌ తన రవాణా విభాగమైన వల్కన్‌ ఎక్స్‌ప్రెస్‌, డిజిటల్‌ పేమెంట్‌ యూనిట్‌ ఫ్రీఛార్జ్‌లను వేర్వేరుగా విక్రయించనున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే మరో ఈ-కామర్స్‌ ఇన్ఫీబీమ్‌ కూడా స్నాప్‌డీల్‌కు భారీ ఆఫర్‌ ఇచ్చిందట. ఈ ప్రతిపాదనకు సైతం స్నాప్‌డీల్‌ సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇన్ఫీబీమ్‌ ఎంత మొత్తం ఆఫర్‌ చేసిందనే విషయాలు మాత్రం తెలియరాలేదు. ఈ వార్తలపై అటు ఫ్లిప్‌కార్ట్‌, ఇటు స్నాప్‌డీల్‌తో పాటు ఇన్ఫీబీమ్‌ నుంచి కూడా ఎలాంటి స్పందనా రాలేదు. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకు గ్రూప్‌ స్నాప్‌డీల్‌లో అతిపెద్ద షేర్‌హోల్డర్‌. భారతీయ మార్కెట్‌లో అతి పెద్ద వాటాదారుగా నిలవడంతో పాటు, అమెజాన్‌ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని నిలబడేందుకు ఫ్లిప్‌కార్ట్‌ యత్నిస్తోంది. ఇందులో భాగంగానే స్నాప్‌డీల్‌ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. మరోపక్క ప్రైవేటు రంగానికి చెందిన యాక్సిస్‌ బ్యాంకు, డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎంలతో సహా పలు సంస్థలు ఫ్రీఛార్జ్‌ను దక్కించుకోవాలని చూస్తున్నాయి.