News

జగన్‌కు తనపైనే నమ్మకం లేదు


ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వంపై వైకాపా అధినేత జగన్‌ ప్లీనరీ వేదికగా చేసిన ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్‌ అసూయపడుతున్నారని.. అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని అన్నారు. చంద్రబాబు 40 ఏళ్లగా రాజకీయాల్లో కొనసాగుతున్నారని.. ఆయన మీద చేసిన ఆరోపణల్లో ఒక్కదాన్ని కూడా ఎవరూ నిరూపించలేకపోయారన్నారు. చంద్రబాబును తిట్టడం కోసమే వైకాపా ప్లీనరీ ఏర్పాటు చేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. జగన్‌ ప్రకటించిన హామీలన్నీ 2014 ఎన్నికల్లో తాము హామీ ఇచ్చి అమలు చేసినవేనని పేర్కొన్నారు. అప్పట్లో చంద్రబాబు నెరవేర్చలేని హామీలిచ్చారని విమర్శించిన జగన్‌.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం అవే హామీలు తానూ ఇస్తున్నారని లోకేశ్‌ విమర్శించారు. తన సారథ్యం మీద నమ్మకం లేకనే జగన్‌ ప్రశాంత్‌ కిషోర్‌ను తెచ్చుకున్నారని ఆరోపించారు.