News

పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పు


పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గురువారం రాత్రి నుంచి స్వల్పంగా తగ్గాయి. విజయవాడ ధరలను లెక్కిస్తే పెట్రోల్‌పై రూ. 1.84, డీజిల్‌పై రూ. 1.67 చొప్పున తగ్గింది. తగ్గుదల మేరకు పెట్రోల్‌ లీటర్‌ రూ. 71.37, డీజిల్‌ రూ.61.09లకు లభించనుంది. అయితే ఈ రేట్లు వివిధ ప్రాంతాలలో స్వల్పంగా పైసలలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు, దూరాన్ని బట్టి రవాణా ఖర్చులు కలుపుతుంటారు. ఇదే విధంగా అయిల్‌ కంపెనీలు కూడా ధరల ప్రకటనలో స్వల్ప వ్యత్యాసం చూపిస్తూ ఉంటాయి. కాగా, ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన పెట్రోల్‌ లీటర్‌కు రూ. 76.62, డీజిల్‌ లీటర్‌ రూ. 64.79 ధరలు ఉండగా జనవరి 16న రూ. 77.18, డీజిల్‌ రూ. 55.04, ఏప్రిల్‌ 1న పెట్రోల్‌ రూ. 72.56, డీజిల్‌ రూ. 62.46, ఏప్రిల్‌ 16న పెట్రోల్‌ రూ. 74.39, డీజిల్‌ రూ. 63.74, మే 1న పెట్రోల్‌ రూ. 74.40, డీజిల్‌ రూ. 64.27, మే 16న పెట్రోల్‌ రూ .71.57, డీజిల్‌ రూ. 61.84, జూన్‌ 1న పెట్రోల్‌ రూ.73.21. డీజిల్‌ రూ. 62.93లుగా ధరలను ప్రకటించారు. ప్రతి నెల ఒకటో తేదీన, 16 వ తేదీన ధరలలో మార్పులు చేస్తూ వస్తున్నారు. ఈనెల 17 వతేదీ నుంచి ఏరోజు కారోజే ధరలను మార్చనున్నారు. క్రూడాయిల్‌ ధరల ఆధారంగా రేట్లను అప్పటికప్పుడు ప్రకటించనున్నారు. దీంతో ప్రతిరోజూ కూడా మార్పులుంటాయని పెట్రోల్‌ డీలర్స్‌ ఫెడరేషన్‌ ప్రతినిధి ఆంధ్రజ్యోతితో చెప్పారు.