News

శిశువుల త‌ల‌లు వేరు చేసిన డాక్ట‌ర్లు


అమెరికా డాక్ట‌ర్లు త‌ల‌లు అంటుకుని పుట్టిన అవిభ‌క్త క‌వ‌ల‌ల‌కు పున‌ర్జీవం పోశారు. 10 నెల‌ల ఆడ‌శిశువుల‌ను విజ‌య‌వంతంగా వేరు చేశారు. ఫిల‌డెల్ఫియా పిల్ల‌ల ద‌వాఖాన‌లో సుమారు 11 గంట‌ల పాటు ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ఎరిన్‌, అబ్బే డిలానే అనే అమ్మాయిలు త‌ల‌లు అంటుకుని పుట్టారు. స‌ర్జ‌రీ తర్వాత ఇద్ద‌రూ కోలుకుంటున్నార‌ని డాక్ట‌ర్లు చెప్పారు. అమ్మాయిల‌కు గ్రీన్‌, ప‌ర్ప‌ల్ టేపులు వేసి మ‌రీ డాక్ట‌ర్లు ఆప‌రేష‌న్ చేశారు. అవిభ‌క్త క‌వ‌ల‌ల‌ను వేరు చేయ‌డం సంక్లిష్ట‌మైన శ‌స్త్ర చికిత్స అని, ఫ‌లితం పాజిటివ్‌గా ఉంటుంద‌ని ఆశిస్తున్న‌ట్లు డాక్ట‌ర్ జెస్సీ టేల‌ర్ తెలిపారు. ప్లాస్టిక్ స‌ర్జ‌న్ అయిన డాక్ట‌ర్ జెస్సీ టేల‌ర్ సుమారు 30 మంది స‌భ్యుల‌తో ఈ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. గ‌త 30 ఏళ్ల‌లో ఫిల‌డెల్ఫియా పిల్లల ద‌వాఖాన మొత్తం 23 మంది అవిభ‌క్త క‌వ‌ల‌ల‌కు స‌క్సెస్‌ఫుల్‌గా స‌ర్జ‌రీ చేసింది. త‌ల‌లు అంటుకుని పుట్ట‌డాన్ని వైద్య‌ప‌రిభాష‌లో క్రెనియోఫాగ‌స్ అంటారు. అవిభ‌క్త‌ ఆడ‌శిశువులు ఎరిన్‌, అబ్బేలు ప‌ది వారాల‌ ముందే పుట్టారు. ఈ జూలైలో వాళ్లు మొద‌టి పుట్టిన రోజు జ‌రుపుకోనున్నారు. వాళ్ల‌కు ఇదే అద్భుత‌మైన బ‌ర్త్‌డే గిఫ్ట్ అని డాక్ట‌ర్లు అంటున్నారు.