News

నేడే ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుక


ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న వందేళ్ల వేడుకలకు ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధమైంది. చరిత్రాత్మక ఉత్సవాలకు వేదికగా ఉన్న ఏ గ్రౌండ్స్‌ ఈ వేడుకలకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఏ గ్రౌండ్స్‌ను, సభాస్థలిని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. పదహారు వేల మంది అతిథులకు ఈ వేదిక ఆతిథ్యమివ్వనుంది. ఇక ఈ వేడుకలను దేశ ప్రథమ పౌరుడు ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. హై సెక్యురిటీ జోన్‌గా పరిగణిస్తూ వర్సిటీ మొత్తాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. వేడుక సందర్భంగా ఎంట్రీ పాస్‌ కాని, ఆహ్వాన పత్రికకానీ లేకుంటే బుధవారం క్యాంప్‌సలోకి అనుమతించేదిలేదని తేల్చిచెప్పారు. వీటితోపాటు ఆధార్‌కార్డ్‌ తప్పనిసరిగా తీసుకురవాలని అతిథులకు సూచిస్తున్నారు. మరోపక్క మొబైల్‌ ఫోన్లను కూడా సభలోకి అనుమతించడంలేదు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మధ్యాహ్నం 12.30నుంచి గంటసేపు ఉన్నా ఉదయం 11.30 కల్లా ఎవరికి కేటాయించిన గ్యాలరీలోకి వారు చేరుకోవాలని ఇటు పోలీసులు, అటు వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఎస్‌.రామచంద్రం విజ్ఞప్తి చేస్తున్నారు. భద్రత నిమిత్తం మొత్తం 3500 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. సభలోనూ వర్సిటీ పరిసర ప్రాంతాల్లో నిఘా నిమిత్తం 170 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. దీనితోపాటు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా విద్యార్థి సంఘాల నాయకులతో వీసీ సమావేశం నిర్వహించారు. వారి డిమాండ్లను తీర్చే బాధ్యతను తీసుకుంటానంటూ హామీ ఇవ్వడంతో విద్యార్థి నాయకులు వేడుకలకు మద్దతు తెలిపారు.వేడుకలను రాష్ట్రపతి మధ్యాహ్నం ప్రారంభించనున్నా.. ఉదయం 10.30 నుంచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. అమరవీరుల స్మరణతో ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి