News

తెలంగాణలో మూర్ఖపు రాజు పాలన సాగుతోంది


తెలంగాణలో మూర్ఖపు రాజు పాలన సాగుతోంది.. చెపితే వినడు.. చెప్పింది చేయడు.. ఇదే ధోరణి కొనసాగితే రాష్ట్రం అదోగతేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. మహాజన పాదయాత్ర గురువారం రాత్రి గార్లకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక గంటే రామదాస్‌ నగర్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై ఆయన నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీ లు, చేసిన వాగ్ధానాలను గాలిలో కలిపి గారడీ చేస్తున్నాడని దుయ్యబట్టాడు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ల కాలంలో కేసీఆర్‌ చెప్పిందొకటి చేసేది మరొకటన్నారు. ప్రజల బాగోగులను పట్టించుకోకుండ గాలిలో మేడలు కట్టి ఊహల్లో విహరించిన తుగ్లక్‌ పాలనకు నేడు రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనకు ఏమాత్రం తేడాలేదన్నారు. కొడుక్కి మిషన్‌ భగీరధ, అల్లుడికి మిషన్‌ కాకతీయ, బిడ్డకు బతుకమ్మల పేరిట తాను హోల్‌సేల్‌గా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ దుష్టచతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. సామాజిక తెలంగాణతోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందని ఇందుకోసం కలిసొచ్చే శక్తులు సామాజిక, కుల, ప్రజా సంఘాలు సంఘితమవుదామని సభాసాక్షిగా తమ్మినేని వీరభద్రం ఆహ్వానించారు. పేద ప్రజలు కలలు కన్న నవ తెలంగాణ సాధన కోసం జరుగుతున్న మహాజన పాదయాత్ర అధికార పార్టీలో గుబులు రేపుతోందన్నారు. సీపీఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో సీపీఎం శాసన సభాపక్షనేత భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు జాన్‌ వెస్లీ, పి.సుదర్శన్‌, బి.వెంకట్‌, మల్లు స్వ రాజ్యం, బత్తుల హైమావతి, జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌, ఈశ్వర్‌లింగం, పాలడుగు భాస్కర్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.