News

కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలి


అవినీతి ఆరోపణలెదుర్కొంటున్న హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజుకి పార్టీ అండగా నిలిచింది. ఆయనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. భాజపా నేత శ్రీకాంత్‌ శర్మ మాట్లాడుతూ అరుణాచల్‌ ప్రదేశ్‌లో పవర్‌ ప్రాజెక్టు విషయమై మంత్రిపై కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలు వాస్తవదూరాలన్నారు. అవినీతి కుంభకోణాలకు అడ్రస్‌ కాంగ్రెస్‌ పార్టీనేనని విమర్శించారు. హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులకు సంబంధించిన పలు అక్రమాలకు కేంద్రం కాంగ్రెస్‌ పార్టీ నేతలేనని ఆరోపించారు. చిన్న సబ్‌ కాంట్రాక్టర్‌లకు రిజిజు సహాయం మాత్రమే చేశారని, వారి డబ్బంతా కంపెనీ లాగేసుకోగా వారికి సాయపడవలసిందిగా కోరుతూ మంత్రి ఒక లేఖ రాయడం ఏవిధంగా అవినీతి అవుతుందని శర్మ ప్రశ్నించారు. ఈరోజు ఉదయం ఈ ఆరోపణలపై స్పందిస్తూ కిరణ్‌ రిజిజు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తనపై అవినీతి ఆరోపణలు చేసినవారు అరుణాచల్‌ ప్రదేశ్‌ వస్తే అక్కడివారు చెప్పుచ్చుకు కొడతారని మండిపడ్డారు. సొంత మనుషులకోసం సహాయం చేయడం అవినీతి ఎలా అవుతుందని మంత్రి ప్రశ్నించారు.