News

ఆర్బీఐ కీలక అధికారి అరెస్ట్


మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అసలు లక్ష్యం కొంతమంది అక్రమార్కుల స్వార్థం వల్ల పక్కదోవ పడుతోంది. బ్యాంకు అధికారులు నుంచి బడా పారిశ్రామికవేత్తల దాకా పాత నోట్ల మార్పిడిలో పట్టుబడుతున్న ఉదంతం రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. తాజాగా ఆర్బీఐలో సీనియర్ స్పెషల్ అసిస్టెంట్‌గా వ్యవహరిస్తున్న కె.మిచెల్‌ను బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత నోట్ల మార్పిడి వ్యవహారంలో ఈ అధికారి కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. దాదాపు కోటి రూపాయల దాకా చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరో 8 మందిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే, కర్ణాటకలో పాత నోట్ల దందాను ఈడీ అధికారులు బట్టబయలు చేశారు. కస్టమర్లలాగా వెళ్లి అక్రమార్కుల ఆట కట్టించారు. వారి వద్ద నుంచి 93లక్షల రూపాయల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా రోజుకో వ్యవహారం బయటపడుతుండటంతో ఇంకెంత మంది కోట్లకు కోట్లు వెనకేశారోనని సామాన్య జనం చర్చించుకుంటున్నారు.