News

దాడుల‌ను ఆపాల్సిందిగా పాక్ వేడుకుంది


జ‌వాను త‌ల న‌రికినందుకు ప్ర‌తీకారంగా స‌రిహ‌ద్దులో భార‌త్ చేప‌ట్టిన దాడుల‌ను ఆపాల్సిందిగా పాకిస్థాన్ వేడుకుంద‌ని ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌పై భార‌త్ దీటుగా స్పందించింది. పాకిస్థాన్ పోస్టుల‌పై దాడుల‌ను ఉద్ధృతం చేసింది. దీంతో రెండు రోజుల కింద‌ట పాకిస్థాన్ ఫోన్ చేసి.. దాడుల‌ను వెంట‌నే ఆపాల్సిందిగా వేడుకుంది అని పారిక‌ర్ తెలిపారు. మంగ‌ళ‌వారం పాకిస్థాన్‌ ఓ భార‌త జ‌వాను త‌ల న‌రికిన విష‌యం తెలిసిందే. దీంతో ఆ త‌ర్వాతి రోజు ప్ర‌తీకారంగా ఇండియ‌న్ ఆర్మీ నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి ఉన్న‌ పాక్ పోస్టుల‌పై దాడుల‌ను తీవ్రం చేసింది. పూంచ్‌, రాజౌరీ, కెల్‌, మ‌చిల్ సెక్టార్ల‌లోని పాక్ పోస్టుల‌పై కాల్పులు జ‌రుపుతూనే ఉంది. దీంతో ఆ దేశం కాళ్ల‌బేరానికి వ‌చ్చిన‌ట్లు పారిక‌ర్ చెప్పారు. అయితే కాల్పుల విర‌మ‌ణ ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డుతోంది మీరేన‌ని తాను గుర్తు చేసిన‌ట్లు ర‌క్ష‌ణ మంత్రి తెలిపారు. దాడుల ఆప‌డానికి మాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు.. జ‌ర‌పాల‌న్న ఆస‌క్తి లేద‌ని వాళ్ల‌కు చెప్పాము. అయితే అవ‌త‌లివైపు నుంచి క‌చ్చితంగా ఆగాల‌ని స్ప‌ష్టంచేశాం. దీంతో గ‌త రెండు రోజులుగా ఎలాంటి కాల్పుల ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌లేదు అని పారిక‌ర్ అన్నారు. భార‌త జ‌వాను త‌లను పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు న‌ర‌క‌డాన్ని పిరికిపంద చ‌ర్య‌గా అభివ‌ర్ణించిన ఇండియ‌న్ ఆర్మీ.. దీనికి త‌గిన శాస్తి చెల్లించాల్సిందేనంటూ త‌ర్వాతి రోజు దాడుల‌ను ఉద్ధృతం చేసిన విష‌యం తెలిసిందే.