News

ఆధార్‌ ఉంటే చాలు డబ్బు లేకున్నా సర్జరీలు చేస్తాం


మీ దగ్గర అన్ని పెద్ద నోట్లే ఉన్నాయా? ఇంకా కొత్త కరెన్సీలోకి మార్చుకోలేదా? మీరు అత ్యవసరంగా ఆర్ధోపెడిక్‌ శస్త్రచికిత్స చేయించుకోవాలా? మీకేం ఫర్వాలేదు. ‘‘కేవలం ఆధార్‌ కార్డుతో రండి. డబ్బులు ఇవ్వకపోయినా ఆపరేషన్‌ చేస్తాం’’ అంటూ గుంటూరుకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ప్రకటించారు. ప్రధాని మోదీ పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత, ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లే రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో గుంటూరు సాయిభాస్కర్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఎండీ నరేంద్రరెడ్డి ముందుకొచ్చారు. నల్లధనం కట్టడికి ప్రధానిమోదీ తీసుకున్న నిర్ణయానికి సంఘీభావంగా తన వంతు సామాజిక బాధ్యతగా డిసెంబరు 30 వరకు తమ హాస్పిటల్‌లో ఎముకలు, కీళ్లకు సంబంధించిన ఔట్‌ పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌ విభాగాల్లో చికిత్స పొందే రోగులు, మోకీలు, తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన వారు నగదు చెల్లించకపోయినా చికిత్సలు అందిస్తామని తెలిపారు. ఆధార్‌కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డు అందజేసి శస్త్రచికిత్స చేయించుకోవచ్చన్నారు. వచ్చే ఏడాది మార్చి తర్వాత కొత్త నగదు చెల్లించవ్చని తెలిపారు. నగదు లేకున్నా ఓపీ, ఇతర అత్యవసర సేవలు చేయించుకోవచ్చన్నారు. ఓపీ సేవలకు ఎటువంటి గుర్తింపు కార్డులు కూడా అవసరం లేదని చెప్పారు. రోగుల దగ్గర క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డులు, చెక్‌లు, ఇతర ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ నగదు బదిలీ ప్రక్రియలను ఆమోదిస్తామన్నారు. నల్లధనం నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రక్షాళన చర్యలకు పౌరులు తమ వంతు సహకారం అందించాలని డాక్టర్‌ నరేంద్రరెడ్డి కోరారు.