News

ట్రంప్‌కు ఎన్‌టీఆరే ఆదర్శమట


అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావును ఆదర్శంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. అసలు సంగతేమిటంటే... నాలుగేళ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగనున్న డొనాల్డ్ ట్రంప్ తాను తీసుకోబోయే జీతమెంతో ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా కొనసాగే వ్యక్తికి సంవత్సరానికి నాలుగు లక్షల అమెరికన్ డాలర్లు వేత్తనంగా చెల్లిస్తారు. భారతీయ కరెన్సీలో దాదాపు అక్షరాలా 2 కోట్ల 60 లక్షల రూపాయలు జీతంగా లభిస్తుంది. కానీ ఆ జీతం తనకు అవసరం లేదని, సంవత్సరం మొత్తానికి జీతంగా కేవలం ఒకే ఒక్క అమెరికన్ డాలర్‌ను తీసుకుంటానని ప్రకటించారు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 66కు అటుఇటుగా తీసుకోనున్నారు. అంతేకాదు సెలవులు కూడా తీసుకోకుండా పనిచేస్తానని ప్రకటించారు. అధ్యక్షుడిగా వచ్చే జీతం తనకు అవసరం లేదని, దేశానికి సేవ చేయడమే ముఖ్యమని ప్రకటించారు. దేశానికి చేయాల్సిన సేవ చాలా ఉందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన అనంతరం కేవలం ఒకే ఒక్క రూపాయిని నెల జీతంగా తీసుకుంటానని అప్పట్లో చెప్పిన సంగతి తెలిసిందే. కాకపోతే, ఎన్టీఆర్ నెల రోజుల కాలానికి ఒక రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటానని ప్రకటించగా,  ట్రంప్ మరో అడుగు ముందుకేసి సంవత్సర కాలానికి ఒక డాలర్ జీతంగా తీసుకుంటానని చెబుతున్నారు.