News

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా


సట్లెజ్‌-యమునా లింక్‌ (ఎస్‌వైఎల్‌) కెనాల్‌ నీటి పంపకాల ఒప్పందాల రద్దు చెల్లదంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు పంజాబ్‌లో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ దీనిని ప్రచారాస్త్రం చేసుకుంది. ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ నేతృత్వంలోని అకాలీదళ్‌-బీజేపీ ప్రభుత్వం పంజాబ్‌ ప్రయోజనాలను పరిరక్షించడంలో విఫలమైందంటూ.. ఇందుకు నిరసనగా.. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 42 మంది ఎంపీలూ రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం ప్రతిపక్ష నేత చరణ్‌జిత చనీ నేతృత్వంలో సీఎల్పీ భేటీ జరిగింది. ఆ సందర్భంగా రాజీనామాలు చేశారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు అమరీందర్‌సింగ్‌, సీనియర్‌ నేతలు అంబికా సోనీ, ప్రతా్‌పసింగ్‌ బజ్వా ఆధ్వర్యంలో వారు అసెంబ్లీ స్పీకర్‌ చరణ్‌జితసింగ్‌ అత్వాల్‌ను కలిసేందుకు వెళ్లారు. ఆయన తన కార్యాలయంలో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి శశి లఖన్‌పాల్‌ మిశ్రాకు రాజీనామాలు అందజేశారు. వాటిని స్పీకర్‌కు పంపుతానని, వాటిని ఆమోదించాలో వద్దో ఆయన నిర్ణయిస్తారని మిశ్రా వెల్లడించారు. కాగా.. అమరీందర్‌సింగ్‌ గురువారమే తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించనుంది. కెనాల్‌ చివరి ప్రాంతంలో ఈ ర్యాలీకి సన్నాహాలు చేస్తోంది. అలాగే రాష్ట్రపతిని కలిసి కెనాల్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరతామని అమరీందర్‌ తెలిపారు. కేంద్ర మంత్రి, బాదల్‌ కోడలు హర్‌సిమ్రత కౌర్‌, పాలక పక్ష ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆమ్‌ ఆద్‌మీ పార్టీ (ఆప్‌) నాయకులు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అమరీందర్‌ తీరుపై బాదల్‌ మండిపడ్డారు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకూడదని సవాల్‌ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికే రాజీనామాల డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. తానొక్కడే రాజీనామా చేయడం కాదని, రాష్ట్రానికి చెందిన మిగతా కాంగ్రెస్‌ ఎంపీల చేత కూడా చేయించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి ఎస్‌వైల్‌ కెనాల్‌ నిర్మాణం పూర్తిచేయించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెసే కారణమన్నారు. ఒక్క నీటి చుక్కను కూడా ఇతర రాష్ట్రాలకు వదిలేది లేదని, కెనాల్‌ నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పడనివ్వబోమని బాదల్‌ స్పష్టంచేశారు.