News

ట్రావెల్స్‌ బస్ బోల్తా ముగ్గరు దుర్మరణం


శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి వద్ద సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గరు దుర్మరణం చెందారు. వీరిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఆంధ్రా బ్యాంకు ఉద్యోగి శ్రీనివాసులు (46), ఆయన స్నేహితుడు మోహన (46), ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం సంతరాపూరుకు చెందిన కొల్లం ఝాన్సీ (22) ఉన్నారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. కర్ణాటక రాష్ట్రం వినాయక ట్రావెల్స్‌కు చెందిన (కేఏ01- 4433) బస్సు ఆదివారం సాయంత్రం విజయవాడ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. మార్గ మధ్యంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన వారూ బెంగళూరుకు వెళ్లడానికి ఈ బస్సెక్కారు. సోమవారం తెల్లవారుజామున శ్రీకాళహస్తి పట్టణం దాటి సుమారు ఆరు కిలోమీటర్లు ప్రయాణించాక.. డ్రైవర్‌ కన్నప్ప(40) మగత నిద్రలోకి జారుకున్నాడు. దీంతో వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పగా.. అప్రమత్తమైన డ్రైవరు నియంత్రించేలోగానే బోల్తా పడింది. దీంతో చివరి వరుస సీట్లలో కూర్చున్న నెల్లూరు జిల్లా కావలి పట్టణం వైకుంఠపురానికి చెందిన ఆంధ్రాబ్యాంకు ఉద్యోగి శ్రీనివాసులు, ఆయన స్నేహితుడు మోహన, ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం సంతరాపూరుకు చెందిన వెంకట సుబ్బారావు కుమార్తె కొల్లం ఝాన్సీ దుర్మరణం చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌ కన్నప్ప ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. శ్రీకాళహస్తి రూరల్‌ సీఐ సుదర్శనప్రసాద్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.